Almond Halwa : బాదంపప్పును తినడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బాదంపప్పును నీటిలో నానబెట్టి తినడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. దీని వల్ల వాంతికి వచ్చిన ఫీలింగ్ కలగకుండా ఉంటుంది. బాదం పప్పును రోజూ తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. కంటి చూపు మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా మనకు ఈ పప్పు వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే బాదంపప్పుతో మనం అనేక రకాల వంటకాలను కూడా చేస్తుంటాం.
బాదంపప్పుతో ఎక్కువ శాతం మంది తీపి వంటకాలనే చేస్తుంటారు. మనకు స్వీట్ షాపుల్లో బాదంపప్పులతో చేసిన రకరకాల స్వీట్లు లభిస్తుంటాయి. వాటిల్లో బాదం హల్వా కూడా ఒకటి. వాస్తవానికి బాదంపప్పు హల్వాను చేయడం చాలా ఈజీ. కాస్త శ్రమించాలే కానీ ఇంట్లోనే దీన్ని ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇక బాదంపప్పు హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పు హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు – 200 గ్రాములు, చక్కెర – 100 గ్రాములు, పసుపు రంగు – చిటికెడు, యాలకుల పొడి – 1 టీస్పూన్, పాలు – 150 ఎంఎల్, నెయ్యి – 100 గ్రాములు.
బాదంపప్పు హల్వాను తయారు చేసే విధానం..
వేడి నీటిలో బాదంపప్పును 40 నిమిషాల పాటు నానబెట్టాలి. పొట్టు తీసి గ్రైండర్‌లో వేసి చక్కెర, యాలకుల పొడి వేసి బరకగా పట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి గ్రైండ్ చేసుకున్న బాదంపప్పు మిశ్రమంతోపాటు పసుపు రంగు, పాలు పోలిసి 15 నుంచి 20 నిమిషాలపాటు మీడియం మంటపై ఉడికించాలి. లేదా నెయ్యి పైకి తేలే వరకు ఉడికించాలి. చల్లారిన తరువాత బాదం పలుకులతో గార్నిష్ చేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే బాదంపప్పు హల్వా రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈసారి మీ ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినా లేదా పండుగ అయినా సరే కొత్తగా ఈ స్వీట్‌ను ట్రై చేయండి. బాగుంటుంది.