Bread Veg Rolls : బ్రెడ్ వెజ్ రోల్స్‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Bread Veg Rolls : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. ఇలా బ్రెడ్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన స్నాక్ ఐట‌మ్స్ లో బ్రెడ్ వెజ్ రోల్స్ కూడా ఒక‌టి. బ్రెడ్ తో చేసే ఈ వెజ్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని ప‌ది నిమిషాల్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవ‌చ్చు. ఈ వెజ్ రోల్స్ ను ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఈ బ్రెడ్ వెజ్ రోల్స్ ను అప్ప‌టికప్పుడు సుల‌భంగా ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ వెజ్ రోల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌నీర్ తురుము – 150 గ్రా., చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం – చిన్న‌ది ఒక‌టి, ఉల్లిపాయ త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, బ్రెడ్ స్లైసెస్ – 5, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్.

how to make Bread Veg Rolls recipe in telugu
Bread Veg Rolls

బ్రెడ్ వెజ్ రోల్స్ త‌యారీ విధానం..

ముందుగా జంబో సైజ్ లో ఉండే బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటికి ఉండే అంచుల‌ను తీసి వేయాలి. త‌రువాత వాటిని చ‌పాతీ క‌ర్ర‌తో నెమ్మ‌దిగా ప‌లుచ‌గా అయ్యేలా వ‌త్తుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో ప‌నీర్ తురుమును తీసుకోవాలి. ఇందులో బ‌ట‌ర్ త‌ప్ప మిగిలిన ప‌దారర్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత బ్రెడ్ స్లైస్ ను తీసుకుని దానికి చివ‌ర్లో 2 టీ స్పూన్ల ప‌నీర్ మిశ్ర‌మాన్ని ఉంచి స‌ర్దుకోవాలి. త‌రువాత బ్రెడ్ ను నెమ్మ‌దిగా రోల్ చేసుకోవాలి. బ్రెడ్ అంచులు ఊడిపోకుండా నీటితో త‌డి చేసుకోవాలి. లేదంటే మైదాపిండి పేస్ట్ ను రాసుకోవాలి.

ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ క‌రిగిన త‌రువాత బ్రెడ్ రోల్స్ ను వేసి కాల్చుకోవాలి. ఈ రోల్స్ పై బ్ర‌ష్ తో కొద్ది కొద్దిగా బ‌ట‌ర్ ను రాస్తూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ వెజ్ రోల్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు వీటిని మ‌రింత ఇష్టంగా తింటారు.

D

Recent Posts