Idli 65 : మనం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇడ్లీలు కూడా ఒకటి. చట్నీ, సాంబార్ తో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఒక్కోసారి మన ఇంట్లో ఇడ్లీలు ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి. చల్లారిన, మిగిలిపోయిన ఇడ్లీలను తినడానికి ఎవరూ ఇష్టపడరు. ఇలా ఎక్కువగా మిగిలిన ఇడ్లీలతో మనం ఎంతో రుచిగా ఉండే స్నాక్స్ ను తయారు చేసుకోవచ్చు. మిగిలిన ఇడ్లీలతో చేసే ఈ ఇడ్లీ 65 చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటుంది. ఇడ్లీలను తినని వారు కూడా ఈ ఇడ్లీ 65 ని ఇష్టంగా తింటారు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ ఇడ్లీ 65 ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీలు – 6, ఉప్పు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా పొడి – పావు టీస్పూన్, పెరుగు – పావు కప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్.
టాసింగ్ కు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – అర టేబుల్ స్పూన్, అల్లం తరుగు – అర టేబుల్ స్పూన్, కరివేపాకు -ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, పెరుగు – 3 టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, పసుపు – కొద్దిగా, ఉప్పు – కొద్దిగా.
ఇడ్లీ 65 తయారీ విధానం..
ముందుగా ఇడ్లీలను 4 ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నింటిని వేసి ఇడ్లీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఇడ్లీ ముక్కలను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. ఇవి మాడిపోకుండా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన ఇడ్లీ ముక్కలు వేసి కలపాలి. వీటిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ 65 తయారవుతుంది. ఈ ఇడ్లీ 65ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.