Immunity Booster Drink : చలికాలం రానే వచ్చింది. చలికాలం వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే చలికాలంలో అనారోగ్య సమస్యలు, ఇన్పెక్షన్ లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక చలినుండి రక్షించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే వాటిని తీసుకోవాలి. చలికాలంలో చాలా మంది చలినుండి రక్షణ పొందడానికి టీ, కాపీలను తాగుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల చలి నుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఇన్పెక్షన్ లు దరి చేరకుండా ఉంటాయి. బరువు తగ్గవచ్చు. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఈ కషాయాన్ని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కషాయం తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – ఒక అంగుళం, వాము – అర టీ స్పూన్, మిరియాలు -అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక అంగుళం, పుదీనా ఆకులు లేదా తులసి ఆకులు – గుప్పెడు, నీళ్లు – అరలీటర్, బెల్లం – రుచికి తగినంత, పసుపు – అర టీ స్పూన్.
కషాయం తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో అల్లం ముక్కలు, వాము, మిరియాలు, దాల్చిన చెక్క, పుదీనా ఆకులు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి అందులో నీళ్లు పోయాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి నీరు మరిగి వరకు ఉంచాలి. నీరు మరిగిన తరువాత మరో రరెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నీటిలో బెల్లం, పసుపు వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత వడకట్టి కప్పులో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కషాయం తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తాగడం వల్ల చలినుండి ఉపశమనం కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.