Instant Dosa Powder : మనం అల్పాహారంగా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే వివిధ రుచుల్లో వీటిని మనం తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే దోశలను తయారు చేయడానికి మనం ముందుగానే పిండిని సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. పప్పును నానబెట్టి పిండి రుబ్బితే కానీ మనం దోశలను తయారు చేసుకోలేము. మనకు మార్కెట్ లో దోశ పిండి, దోశ ఇన్ స్టాంట్ మిక్స్ లు లభించినప్పటికి వాటిని నిల్వ చేయడానికి ఫ్రిజర్వేటివ్స్ ను కలుపుతూ ఉంటారు. ఎటువంటి ఫ్రిజర్వేటివ్స్ లేకుండా మన ఇంట్లోనే మనం ఇన్ స్టాంట్ దోశ పౌడర్ ను తయారు చేసుకోవచ్చు. ఈ పౌడర్ ను తయారు చేయడం చాలా సులభం. ఈ దోశ పౌడర్ మన ఇంట్లో ఉంటే కేవలం పది నిమిషాల్లోనే మన దోశలను వేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ దోశ పౌడర్ ను మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ దోశ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – 4 కప్పులు, మినపగుళ్లు – ఒక కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
ఇన్ స్టాంట్ దోశ పౌడర్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో బియ్యం, మినపగుళ్లు, మెంతులు వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోశల పౌడర్ తయారవుతుంది. ఈ పౌడర్ ను గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల కొన్ని నెలల పాటు ఇది తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పొడిని మనకు తగినంత మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. నూనె వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే దోశ తయారవుతుంది. ఈ దోశను ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సాధారణ దోశలే కాకుండా మసాలా దోశలు, ఉల్లి దోశలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉండే వారు ఈ విధంగా దోశలను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.