Instant Milk Sweet : మనం పాలతో రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పాలతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పాలతో చేసిన తీపి వంటకాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పాలతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో మిల్క్ స్వీట్ కూడా ఒకటి. పాలు, గోధుమపిండితో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మైదాపిండి, కార్న్ ఫ్లోర్ కు బదులుగా మనం దీని తయారీలో గోధుమపిండిని వాడుతున్నాము. కనుక దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగదు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా, కమ్మగా ఉండే మిల్క్ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్క్ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ – పావు కప్పు, గోధుమపిండి – ముప్పావు కప్పు, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, కాచిచల్లార్చిన చిక్కటి పాలు – రెండు కప్పులు, పంచదార – ఒకటిన్నర కప్పు, నీళ్లు – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మిల్క్ స్వీట్ తయారఈ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రవ్వ వేసి వేయించాలి. దీనిని చిన్న మంటపై రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత గోధుమపిండి వేసి కలపాలి. దీనిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత కొబ్బరిపొడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత పాలు పోసి కలపాలి. దీనిని ఉండుల లేకుండా చపాతీ పిండిలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి.
పంచదార కరిగి గులాబ్ జామున్ పాకం వచ్చే వరకు ఉడికించాలి. పంచదార మిశ్రమం కొద్దిగా జిగురుగా అయిన తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న గోధుమపిండి మిశ్రమాన్ని తీసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం గట్టిగా ఉంటే కొద్దిగా పాలు పోసి మెత్తగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ పిండి మెత్తగా ఉంటే కొద్దిగా గోధుమపిండి వేసి కలపాలి. దీనిని చక్కగా అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకు కావల్సిన ఆకారంలో వత్తుకోవాలి. వీటిని బాదుషాగా లేదా కోవా బిళ్లలుగా లేదా సిలిండర్ ఇలా మనకు నచ్చిన ఆకారంలో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక మనం వత్తుకున్న వాటిని నూనెలో వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని పంచదార పాకంలో వేసుకోవాలి. వీటిపై కొద్దిగా పంచదార పాకాన్ని పోసి మూత పెట్టి 2 నుండి 3 గంటల పాటు అలాగే ఉంచాలి. ఈ స్వీట్ పంచదార పాకాన్ని పీల్చుకుని మెత్తబడిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిల్క్ స్వీట్ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే మిల్క్ స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.