Instant Tomato Pickle : మన ఆరోగ్యంతో పాటు అందానికి మేలు చేసే కూరగాయల్లో టమాటాలు ఒకటి. టమాటాలను విరివిరిగా ఉపయోగించని వంటగది ఉండదనే చెప్పవచ్చు. టమాటాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. టమాటాలతో వివిధ రకాల కూరలతో పాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. టమాట పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఎక్కువగా టమాట పచ్చడినే అందరూ ఇష్టపడుతూ ఉంటారు. టమాటాలతో అప్పటికప్పుడే ఎంతో రుచిగా పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. ఇన్ స్టాంట్ గా టమాటాలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – ఒక కిలో, చింతపండు – 50 గ్రా., కారం – 50 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 5, మెంతి పిండి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – 2 టేబుల్ స్పూన్స్, ఇంగువ – రెండు చిటికెలు, ఎండుమిర్చి – 3, నూనె – 100 గ్రా., ఉప్పు – తగినంత, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5.
ఇన్ స్టాంట్ టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక టమాట ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించాలి. టమాట ముక్కలు కొద్దిగా మగ్గిన తరువాత చింతపండు వేసి కలపాలి. మరలా మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి టమాటాల్లో ఉండే నీరంతా పోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టమాట ముక్కలు చల్లారిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే కారం, మెంతి పిండి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చడి ఆరిన తరువాత తడి లేని గాజు సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పచ్చడి నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నవారు అప్పటికప్పుడు టమాటాలతో ఎంతో రుచికరమైన పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు.