Janthikalu : మనం బియ్యంపిండితో రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోదగిన పిండి వంటకాల్లో జంతికలు కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ జంతికలను తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చేసే జంతికలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అలాగే క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. మరింత రుచిగా, క్రిస్పీగా బియ్యంపిండితో జంతికలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జంతికల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యంపిండి – 2 కప్పులు, మైదాపిండి – ఒక కప్పు, వాము – ఒక టీ స్పూన్, ఆనియన్ సీడ్స్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఇంగువ – పావు టీ స్పూన్, వేడి నూనె లేదా బటర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
జంతికల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మైదాపిండితో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత తగినన్నినీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. తరువాత జంతికల గొట్టాన్ని తీసుకుని అందులో మనకు కావల్సిన బిళ్లను ఉంచి గొట్టానికి నూనెను రాసుకోవాలి. తరువాత అందులో పిండిని ఉంచి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత నూనెలో జంతికలను వత్తుకోవాలి. ఇలా నేరుగా నూనెలో జంతికలను వత్తుకోవడం రాని వారు గంటెపై లేదా బటర్ పేపర్ పై, కాటన్ వస్త్రంపై జంతికలను వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జంతికలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ జంతికలను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయి.