Jonna Kichdi : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నేటి తరుణంలో జొన్నల వాడకం ఎక్కువైందనే చెప్పవచ్చు. జొన్నలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంతత్రంలో ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం బలంగా తయారవుతుంది.
సులభంగా అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. జొన్నలను పిండి, రవ్వగా చేసి రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్నలతో సులభంగా, రుచిగా తయారు చేసుకోదగిన వంటకాల్లో జొన్న కిచిడి కూడా ఒకటి. జొన్న కిచిడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ జొన్న కిచిడిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న కిచిడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, బిర్యానీ ఆకులు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, కరివేపాకు -ఒక రెమ్మ, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, తాజా బఠాణీ – అర కప్పు, తరిగిన క్యారెట్ ముక్కలు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, 4 గంటల పాటు నానబెట్టిన పావు కప్పు పెసర్లు – పావు కప్పు, నీళ్లు – 3 కప్పులు, ఉప్పు -తగినంత, 6 గంటల పాటు నానబెట్టిన జొన్న రవ్వ – ఒక కప్పు.
జొన్న కిచిడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తరుగు వేసి వేయించాలి. తరువాత క్యారెట్, బఠాణీ వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించాలి. తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టిన పెసర్లు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి.
రవ్వ, పెసర్లు పూర్తిగా ఉడికిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న కిచిడి తయారవుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా దీనిని తినవచ్చు. పిల్లలకు ఈ కిచిడిని ఇవ్వడం వల్ల వారి శరీరం బలంగా తయారవుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు ఇలా జొన్న కిచిడిని తయారు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.