Semiya Payasam : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చాలా త్వరగా,చాలా సులువుగా తయారు చేసుకునే తీపి వంటకాలు కూడా ఉంటాయి. ఇలాంటి తీపి వంటకాల్లో సేమియా పాయసం కూడా ఒకటి. దీనిని మనం తరచుగా తయారు చేస్తూనే ఉంటాం. సేమియా పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఈ సేమియా పాయసాన్ని రుచిగా, చల్లారిన తరువాత కూడా గట్టిగా కాకుండా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – అర కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, చిక్కటి పాలు – 3 కప్పులు, కచ్చా పచ్చాగా దంచిన యాలకులు – 3, పంచదార – ముప్పావు కప్పు.
సేమియా పాయసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సేమియా వేసి వేయించాలి. సేమియా ఎర్రగా వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. పాలు మరిగిన తరువాత వేయించిన సేమియా, యాలకులు వేసి కలపాలి. ఈ సేమియాను మెత్తగా అయ్యే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. సేమియా మెత్తగా అయిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తరువాత ఈ సేమియానుయ కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం తయారవుతుంది. ఈ పాయసం చల్లారిన తరువాత కూడా గట్టిపడకుండా చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు ఈ విధంగా చాలా త్వరగా అయ్యే ఈ సేమియా పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఈ సేమియా పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాల్లో ఇలా సేమియా పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు.