Kara Bath : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రవ్వతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కారా బాత్ కూడా ఒకటి. కర్ణాటక స్పెషల్ వంటకం అయిన ఈ కారా బాత్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అల్పాహారంగా తినడానికి ఈ వంటకం చాలా చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే కారా బాత్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కారా బాత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – 20, ఆవాలు- అర టీ స్పూన్, శనగపప్పు – అర టేబుల్ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చి బఠాణీ – రెండు టేబుల్ స్పూన్స్, తరిగిన క్యారెట్ – 2 టేబుల్ స్పూన్స్, బీన్స్ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ – ఒక కప్పు, చిన్నగా తరిగిన టమాట – 1, వేడి నీళ్లు – 3 కప్పులు, పసుపు – అర టీ స్పూన్, పంచదార – ఒక టీ స్పూన్, వాంగీ బాత్ మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మకాయ రసం – కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము – కొద్దిగా.
కారా బాత్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పు వేసి వేయించాలి. దీనిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత కూరగాయ ముక్కలు వేసి 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత రవ్వ వేసి చిన్న మంటపై కలుపుతూ వేయించాలి రవ్వ చక్కగా వేగి తెల్లబడిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి.
దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత పసుపు, పంచదార వేసి కలపాలి. రవ్వ ఉడికి దగ్గర పడిన తరువాత వాంగీ బాత్ మసాలా, కొతత్ఇమీర వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత దీనిపై మరికొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం, పచ్చి కొబ్బరి తురుము చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కారా బాత్ తయారవుతుంది. దీనిని నీర్ చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బొంబాయి రవ్వతో తరచూ ఉప్మానే కాకుండా అప్పుడప్పుడూ ఇలా కారా బాత్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.