Kobbari Pachadi : పచ్చి కొబ్బరిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉంటాయి. పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పచ్చికొబ్బరితో ఎక్కువగా మనం పచ్చడిని తయారు చేస్తూ ఉంటాం. పచ్చికొబ్బరితో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి ముక్కలు – ఒక కప్పు, టమాటాలు – 2, నానబెట్టిన చింతపండు – 10 గ్రా., ఎండుమిర్చి – 15 లేదా తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 6, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
కొబ్బరి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో కొబ్బరి ముక్కలను వేసి ఒక నిమిషం పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో టమాట ముక్కలు, చింతపండు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత ఒక జార్ లో వేయించిన ఎండుమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. చివరగా ఉడికించిన టమాట ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీటిని పోసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
తరువాత కచ్చా పచ్చాగా దంచిన 2 వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి తయారవుతుంది. వేడి వేడి అన్నంతో ఈ పచ్చడిని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఉదయం చేసుకునే అల్పాహారాలను కూడా ఈ పచ్చడితో కలిపి తినవచ్చు.