Koiguddu Tomato Kura : కోడిగుడ్లు అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. వీటిని తరచూ చాలా మంది తింటూనే ఉంటారు. కోడిగుడ్డులో మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలు దాదాపుగా అన్నీ ఉంటాయి. కనుకనే గుడ్డును నిపుణులు సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. కోడిగుడ్లను ఉడకబెట్టి రోజుకు ఒకటి చొప్పున తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఇక గర్భిణీలు, పిల్లలకు రోజుకు ఒక కోడిగుడ్డును ఇవ్వాలని సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే కోడిగుడ్డుతో చాలా మంది రకరకాల వంటలను కూడా చేస్తుంటారు. వాటిల్లో కోడిగుడ్డు టమాటా కూడా ఒకటి. దీన్ని చాలా మంది గుడ్లను మెదిపి చేస్తారు. కానీ గుడ్లను మెదపకుండా అలాగే ఉంచి కోడిగుడ్డు టమాటా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు టమాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4, టమాటాలు – ఒక కప్పు (సన్నగా తరగాలి), ఉల్లిపాయలు – ఒక కప్పు (సన్నగా తరగాలి), నూనె – రెండు టీస్పూన్లు, పచ్చి మిర్చి -2 (సన్నగా చీరాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, ఉప్పు – ఒక టీస్పూన్, గరం మసాలా పొడి – అర టీస్పూన్, కొత్తిమీర – పావు కప్పు (సన్నగా తరగాలి).
కోడిగుడ్డు టమాటాను తయారు చేసే విధానం..
ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి. కాసేపు వేయించి అనంతరం టమాటాలను వేయాలి. అందులోనే ఉప్పు, కారం వేసి బాగా కలిపి టమాటాలు మెత్తగా అయ్యే వరకు స్టవ్‌ను మధ్యస్థ మంటపై ఉంచి ఉడికించాలి. టమాటాలు ఉడికాక అందులో కోడిగుడ్లను కొట్టి వేయాలి. అయితే గుడ్డును కొట్టాక దాన్ని మొత్తం అలాగే ఉంచాలి. మెదపకూడదు. దీంతో గుడ్డు మొత్తం అలాగే ఉడుకుతుంది. ఇలా 4 గుడ్లను వేయాలి. తరువాత మూత పెట్టి గుడ్లను బాగా ఉడికించాలి.
గుడ్లు ఉడికిన తరువాత గరం మసాలా పొడి, కొత్తిమీర చల్లుకుని దించేయాలి. దీంతో ఎంతో రుచికరమైన కోడిగుడ్డు టమాటా రెడీ అవుతుంది. దీన్ని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. అన్నం లేదా చపాతీల్లోకి ఈ కూర అద్భుతంగా ఉంటుంది. గుడ్లను మెదపకుండా అలాగే ఉంచి ఉడికించడం వల్ల రుచి బాగా ఉంటుంది. ఒక్కో గుడ్డును ఒక్కొక్కరు వేసుకుని తినవచ్చు. రొటీన్‌గా కోడిగుడ్డు టమాటాను చేయకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.