Kodiguddu Kura Recipe : శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఉడికించిన కోడిగుడ్డును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలకు కూడా వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అయితే రోజూ ఉడికించిన కోడిగుడ్డును పిల్లలూ తినరు. అలాంటి వారికి అప్పుడప్పుడు కింద చెప్పిన విధంగా కూర చేసి పెట్టడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ కోడిగుడ్డు కూరను తయారు చేసుకోవడంచాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ కూరను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ కూర. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ కోడిగుడ్డు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు = 4, తరిగిన పచ్చిమిర్చి – 5, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, టమాటాలు – 3, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, నీళ్లు – అర గ్లాస్ నుండి ముప్పావు గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కోడిగుడ్డు మిశ్రమం తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 3, ఉప్పు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1.
కోడిగుడ్డు కూర తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. తరువాత కోడిగుడ్డు మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్నగా ఆమ్లెట్ వలె వేసుకోవాలి. వీటిని రెండు వైపులా చక్కగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత టమాటాలను తొక్క లేకుండా తురిమి వేసుకోవాలి. దీనిపై మూత పెట్టి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి కూర ఉడికి నూనె పైకి తేలే వరకు ఉంచాలి. కూర ఉడికిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న ఆమ్లెట్ లను వేసుకోవాలి. దీనిని నెమ్మదిగా కలిపి పైన కొత్తిమీర చల్లుకుని మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా తయారు చేసిన కోడిగుడ్డు కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.