Kodiguddu Pesarapappu Curry : మనం కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే వంటకాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కోడిగుడ్డు పెసరపప్పు కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చేయడం చాలా తేలిక. ఇందులో ఎక్కువగా మసాలాలను వేయాల్సిన అవసరం కూడా ఉండదు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. చిటికెలో ఈ పెసరపప్పు గుడ్డు కూరను ఎలా తయారు చేయాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పు గుడ్డు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్ లేదా తగినంత, నీళ్లు – ఒక గ్లాస్, కోడిగుడ్లు – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

పెసరపప్పు గుడ్డు కూర తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పెసరపప్పు వేసి కలపాలి. ఈ పెసరపప్పును 2 నిమిషాల పాటు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పెసరపప్పును ఉడికించాలి. పెసరపప్పు ఉడికిన తరువాత కోడిగుడ్లను పక్క పక్కకు వేసుకోవాలి.
వీటిని కదిలించకుండా అలాగే ఉంచి మూత పెట్టాలి. కోడిగుడ్లు ఉడికిన తరువాత వీటిని మరో వైపుకు నెమ్మదిగా తిప్పుకోవాలి.వీటిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు కోడిగుడ్డు కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కోడిగుడ్లతో అప్పటికప్పుడు ఎటువంటి మసాలాలు వేయకుండా రుచిగా, సులభంగా కమ్మటి కూరను తయారు చేసుకుని తినవచ్చు.