Kolhapuri Chicken : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. చికెన్ తో వంటకాలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మనం రకరకాల రుచుల్లో ఈ చికెన్ ను వండుతూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన చికెన్ వెరైటీలలో కొల్హాపురి చికెన్ కూడా ఒకటి. ఈ చికెన్ చాలా రుచిగా, ఘాటుగా ఉంటుంది. స్పైసీగా కోరుకునే వారికి ఈ చికెన్ చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కొల్హాపురి చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొల్హాపురి చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, ఉప్పు- తగినంత, పసుపు – పావు టీ స్పూన్, టమాటాలు – 2, వేడి నీళ్లు – 350 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
కారంగా ఉండే ఎండుమిర్చి – 10 లేదా 12, జాజికాయ – పావు ఇంచు, అనాసపువ్వు – 1, నల్ల యాలక్కాయ – 1, చిన్న బిర్యానీ ఆకు – 1, యాలకులు – 2, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 2, మిరియాలు – ఒక టీ స్పూన్, జాపత్రి – 1, ధనియాలు – ఒకటిన్నర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి తురుము – 1/3 చిప్ప, నువ్వలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, గసగసాలు – ఒక టీ స్పూన్.
కొల్హాపురి చికెన్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఎండు కొబ్బరి, నువ్వులు, గసగసాలు తప్ప మిగిలిన మసాలా పదార్థాలన్నీ వేసి వేయించాలి. ఈ మసాలా దినుసులు రంగు మారేటప్పుడు ఎండు కొబ్బరి తురుము వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత నువ్వులు, గసగసాలు వేసి చిటపటలాడే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. తరువాత దీనిని గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు పింక్ రంగులోకి అయిన తరువాత ఉప్పు, పసుపు వేసి గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత చికెన్ వేసి పెద్ద మంటపై నూనె పైకి తేలే వరకు వేయించాలి.
ఇలా వేయించిన తరువాత టమాటాలను మెత్తగా పేస్ట్ లా చేసుకుని వేసుకోవాలి. టమాటాల్లో ఉండే పచ్చి వాసన పోయి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు చికెన్ పై మూత పెట్టి 20 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొల్హాపురి చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో లేదా స్పెషల్ గా చికెన్ కర్రీని తినాలనిపించినప్పుడు ఇలా కొల్హాపురి చికెన్ ను తయారు చేసుకుని తినవచ్చు.