Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి.. కొత్తిమీర, పుదీనా కలిపి చేసే ఈ నిల్వ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ తింటారని చెప్పవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన కొత్తిమీర – ఒక కట్ట ( మధ్యస్థంగా ఉన్నది), తరిగిన పుదీనా – ఒక కట్ట ( మధ్యస్థంగా ఉన్నది), కొత్తిమీర – 2 రెమ్మలు, వేడి నీటిలో నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, మెంతులు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, నూనె – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్ లేదా తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – అర కప్పు, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 10, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2.
కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత కళాయిలో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆరబెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి వేయించాలి. వీటిని క్రిస్సీగా అయ్యే వరకు వేయించిన తరువాత పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత చింతపండు నుండి గుజ్జును తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. తరువాత వేయించిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తరువాత కారం, ఉప్పు, వేయించిన ఆవాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి చక్కగా వేయించాలి. తరువాత ఈ తాళింపును పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది.