Laddu For Anemia : మనలో చాలా మంది వేధించే అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య కూడా ఒకటి. ఎక్కువగా స్త్రీలు ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. రక్తహీనత సమస్యను తేలికగా అస్సలు తీసుకోకూడదు. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. రక్తహీనత సమస్యతో బాధపడే వారు నువ్వులతో కింద చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ లడ్డూలను తినడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రక్తహీనత సమస్య నుండి బయటపడేసే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – ఒక కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్, తాటి బెల్లం తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నువ్వులు వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై మాడిపోకుండా వేయించాలి. నువ్వులు కొద్దిగా వేగిన తరువాత నెయ్యి వేసి కలపాలి. ఈ నువ్వులను దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. నువ్వులు చల్లారిన తరువాత వీటిని నుండి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను తీసి పక్కకు ఉంచాలి. తరువాత మిగిలిన నువ్వులను జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బెల్లం తురుము వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఈ నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని మరోసారి జార్ లో వేసి ముద్దగా అయ్యే వరకు మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పక్కకు ఉంచిన నువ్వులను, మరో టీ స్పూన్ నెయ్యిని, యాలకుల పొడిని వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని చేత్తో బాగా వత్తుతూ 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. తరువాత మనకు పరిమాణంలో లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల లడ్డూలు తయారవుతాయి. వీటిని రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల రక్తహీనత సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ లడ్డూలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తరచూ చేసే నువ్వుల లడ్డూలతో పాటు తాటి బెల్లం వేసి ఇలా రుచిగా, మరింత ఆరోగ్యవంతంగా ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.