Lapsi : లాప్సి.. గోధుమరవ్వతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా దీనిని మహారాష్ట్రలో తయారు చేస్తూ ఉంటారు. సూర్య భగవానుడికి నేవైధ్యంగా ఈ లాప్సిని సమర్పిస్తూ ఉంటారు. లాప్సి చాలా రుచిగా ఉంటుంది. నైవేధ్యంగానే కాకుండా తీపి తినాలనిపించినప్పుడు కూడా దీనిని తయారు చేసుకుని తినవచ్చు. లాప్సిని తయారు చేయడం చాలా తేలిక. అప్పటికప్పుడు దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని, బలాన్ని అందించే మహారాష్ట్ర వంటకమైన లాప్సిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లాప్సి తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రౌన్ కలర్ లో ఉండే గోధుమరవ్వ – అర కప్పు, పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం – అర కప్పు, నీళ్లు – అర కప్పు, నెయ్యి – అర కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, జీడిపప్పు – పిడికెడు, ఎండుద్రాక్ష – 2 టీ స్పూన్స్.
లాప్సి తయారీ విధానం..
ముందుగా కళాయిలో గోధుమరవ్వను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పెసరపప్పు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. దీనిని బెల్లం కరిగే వరకు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన పెసరపప్పు, గోధుమరవ్వ వేసి ఉడికించాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోధుమరవ్వను పూర్తిగా ఉడికించాలి. రవ్వ ఉడికిన తరువాత ఇందులో బెల్లం నీటిని వడకట్టి పోసుకోవాలి. తరువాత దీనిని అంతా కలిసేలా కలుపుకుని మూత పెట్టి ఉడికించాలి.
గోధుమ రవ్వ కొద్దిగా దగ్గర పడిన తరువాత పావు కప్పు నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. తరువాత కళాయిలో మిగిలిన పావు కప్పు నెయ్యి వేసి వేయించాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నెయ్యిని ఉడుకుతున్న గోధుమరవ్వ మిశ్రమంలో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లాప్సి తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా తయారు చేసిన లాప్సిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.