Left Over Rice Idli : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒకటి. చట్నీ, సాంబార్ తో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం సాధారణంగా ఇడ్లీలను మినపప్పుతో తయారు చేస్తూ ఉంటాము. ఇది మనందరికి తెలిసిందే. అయితే కేవలం మినపప్పుతోనే కాకుండా మిగిలిన అన్నంతో కూడా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా.. అవును మిగిలిన అన్నంతో అప్పటికప్పుడు మనం ఎంతో రుచిగా, మెత్తగా ఉండే ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు దానిని పడేయకుండా ఇన్ స్టాంట్ గా ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు. అన్నంతో ఇన్ స్టాంట్ గా మెత్తని ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన ఇడ్లీ రవ్వ – 2 కప్పులు, అన్నం – 2 కప్పులు, పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్.
రైస్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇడ్లీ రవ్వను చేత్తో పిండుతూ మిక్సీ పట్టుకున్న అన్నంలో వేసి కలపాలి. తరువాత ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. తరువాత పిండిని ప్లేట్ లల్లో వేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక ఇడ్లీ ప్లేట్ లను కుక్కర్ లో ఉంచి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి బయటకు తీసి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఇడ్లీలను తీసి ప్లేట్ లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా ఉండే రైస్ ఇడ్లీలు తయారవుతాయి. వీటిని చట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు.