Madras Kheema Masala : మద్రాస్ ఖీమా మసాలా.. మటన్ ఖీమాతో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చెన్నైలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. రోటీ, నాన్, అట్టు, పూరీ, బగారా అన్నం వంటి వాటితో తినడానికి ఈ ఖీమా మసాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఖీమా మసాలాను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ ఖీమా మసాలాను తయారు చేయడం చాలా సులభం. మొదటిసారిచేసే వారు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మటన్ ఖీమాతో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మద్రాస్ ఖీమా మసాలాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మద్రాస్ ఖీమా మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – అర కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, మట్ ఖీమా – 500 గ్రా., పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 300 ఎమ్ ఎల్, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, లవంగాలు – 6, యాలకులు – 5, అనాస పువ్వులు – 2, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 15, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, జీడిపప్పు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్.
మద్రాస్ ఖీమా మసాలా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసు పువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసి మరిగించాలి. వీటిని 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. అలాగే మసాలాలను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని కూడా ముందుగా మిక్సీ పట్టుకున్న అదే జార్ లో వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సోంపు గింజలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత మటన్ ఖీమా వేసి వేయించాలి.
దీనిని 15 నిమిషాల పాటు వేయించిన తరువాత పసుపు, కారం వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువాత మసాలాలు ఉడికించిన నీరు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చిన్న మంటపై 25 నిమిషాల పాటు ఉడికించాలి. మటన్ ఖీమా చక్కగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మద్రాస్ ఖీమా మసాలా తయారవుతుంది. దీనిని వేటితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ ఖీమాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.