Maida Halwa : నోట్లో వెన్న‌లా క‌రిగిపోయే హ‌ల్వా.. ఇలా చేయండి..!

Maida Halwa : మ‌నం వంటింట్లో మైదాపిండితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండితో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. మైదాపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో మైదాహ‌ల్వా కూడా ఒక‌టి. మైదాపిండితో చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా ఉంటుంది. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు లేదా పండ‌గ‌ల‌కు ఇలా హ‌ల్వాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా, మృదువుగా ఉండే మైదాపిండి హ‌ల్వాను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మైదా హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – అర క‌ప్పు, మైదాపిండి – ఒక క‌ప్పు, పంచ‌దార – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక కప్పు, పాల‌పొడి – 3 టేబుల్ స్పూన్స్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్.

Maida Halwa recipe in telugu make in this way
Maida Halwa

మైదా హ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక మైదాపిండి వేసి వేయించాలి. దీనిని క‌లుపుతూ 5 నుండి 6 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో పంచ‌దార‌, నీళ్లు పోసి క‌ల‌పాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత మరో రెండునిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ముందుగా వేయించిన మైద‌పాఇండి మిశ్ర‌మాన్ని, పాల పొడిని, యాల‌కుల పొడిని వేసి చిన్న మంట‌పై క‌లుపుతూ ఉడికించాలి. దీనిని ఉండలు లేకుండా క‌లుపుకున్న త‌రువాత మ‌రో 4 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని చ‌ల్లారే వ‌ర‌కు క‌లుపుతూ ఉండాలి.

కొద్దిగా వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఎయ్యి రాసిన బ‌ట‌ర్ పేప‌ర్ మీద‌కు తీసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని గుండ్రంగా లేదా చ‌తుర‌స్రాకారంలో స‌మానంగా వ‌త్తుకోవాలి. దీనిని అర‌గంట పాటు అలాగే ఉంచిన త‌రువాత మ‌న‌కు కావ‌ల్సిన ఆకారంలో ముక్క‌లుగా క‌ట్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. దీనిపై డ్రై ఫ్రూట్స్ లేదా సిల్వ‌ర్ పేప‌ర్ తో గార్నిష్ కూడా చేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ఇలా మైదాపిండితో హ‌ల్వాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts