Aloo Bajji : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో ఆలూ బజ్జీలు కూడా ఒకటి. ఆలూ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ ఆలూ బజ్జీలను మనం కూడా చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వీటిని పది నిమిషాల్లోనే చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుచిగా, క్రిస్పీగా ఉండే ఆలూ బజ్జీలను ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు, సాయంత్రం సమయాల్లో ఆకలి వేసినప్పుడు వేడి వేడిగా ఈ ఆలూ బజ్జీలను తయారు చేసి తీసుకోవచ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే ఆలూ బజ్జీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), శనగపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
ఆలూ బజ్జీ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి వాటిని చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ చిప్స్ ను ఉప్పు నీటిలో వేసి ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత బియ్యంపిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వాము, కొత్తిమీర, వంటసోడా వేసి కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ బజ్జీలను మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప బజ్జీలు తయారవుతాయి. వీటిని వేడి వేడిగా టమాట కిచప్ తో తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన ఆలూ బజ్జీలను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.