Healthy Rasam : ర‌సం ఇలా చేసి అన్నంలో తినండి.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Healthy Rasam : అల్లం ర‌సం.. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లంతో చేసే ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు అల్లం ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అన్నంతో వేడి వేడిగా ఈ ర‌సాన్ని తీసుకుంటే క‌డుపు నిండుగా భోజనం చేయ‌వ‌చ్చు. ఈ అల్లం ర‌సాన్ని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ అల్లం ర‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, అల్లం – 2 అంగుళాలు, వెల్లుల్లి రెబ్బ‌లు – 3, ట‌మాట – 1, నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని( అర లీట‌ర్), త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, మిరియాల పొడి – అర టీ స్పూన్.

Healthy Rasam recipe make like this for taste and health
Healthy Rasam

అల్లం ర‌సం త‌యారీ విధానం..

ముందుగా రోట్లో అల్లం, వెల్లుల్లి రెమ్మ‌లు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా క‌చ్చా ప‌చ్చ‌గా ఉండేలా దంచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే టమాటాను కూడా ఫ్యూరీలాగా చేసుకుని ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మెంతులు వేసి వేయించాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత దంచుకున్న అల్లం పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి క‌ల‌పాలి.

దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండు ర‌సం, నీళ్లు పోసి కలపాలి. దీనిని ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించిన త‌రువాత కొత్తిమీర‌, మిరియాల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచిన త‌రువాత వేడి వేడిగా స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం ర‌సం త‌యార‌వుతుంది. ఈ విధంగా ర‌సాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

D

Recent Posts