Chicken Curry : మనకు చవకగా లభించే మాంసాహార ఉత్పత్తులల్లో చికెన్ ఒకటి. చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ ను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. మనం చికెన్ తో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎటువంటి మసాలా పేస్ట్ లను వేయకుండా రుచిగా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చి మిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత, ధనియాల పొడి – 2 టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), నీళ్లు – కొద్దిగా, గరం మసాలా – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా దినుసులు..
సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – 2, యాలకులు – 2, లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 1.
చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత మసాలా దినుసులను వేసి ఒక నిమిషం పాటు వేయిచుకోవాలి. తరువాత పచ్చి మిర్చిని, ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత చికెన్ ను వేసి కలపాలి. తరువాత ఉప్పును, పసుపును, కారాన్ని, ధనియాల పొడిని వేసి కలిపి మూత పెట్టి మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించిన తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత టమాట ముక్కలను గంటెతో కూరలో కలిసేలా బాగా వత్తుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీటిని పోసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత గరం మసాలా పొడిని వేసి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. చికెన్ పూర్తిగా ఉడకకపోతే మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత చికెన్ మీద తరిగిన కొత్తిమీరను చల్లాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పూరీ, పుల్కా, రోటీ, రాగి సంగటి వంటి వాటితో కలిపి తింటే రుచితోపాటు చికెన్ ను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.