Chicken Fry : మనం తరచూ చికెన్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చికెన్ తో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాల్లో చికెన్ ఫ్రై ఒకటి. చాలా మంది చికెన్ ఫ్రై ని ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ ఫ్రై ని రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేసినా కూడా చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఫిదా అయ్యేలా, రుచిగా చికెన్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – 500 గ్రా., కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, శనగ పిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నిమ్మ రసం – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రెండు సార్లు శుభ్రంగా కడిగిన చికెన్ ను తీసుకోవాలి. ఇప్పుడు నూనె తప్ప పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసి చికెన్ కు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసి కలిపి మూత పెట్టి 1 గంట పాటు కదిలించకుండా ఉంచాలి. ఒక గంట తరువాత కళాయిలో నూనె వేసి కాగిన తరువాత కొద్ది కొద్దిగా చికెన్ ముక్కలను వేసుకుంటూ మధ్యస్థ మంటపై చికెన్ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వాటిని తీసి పక్కన పెట్టాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలను వేయించాలి. దీంతో చికెన్ ఫ్రై తయారవుతుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని నేరుగా లేదా ఇతర కూరలతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.