మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతోపాటు ఇతర పోషకాలను కూడా అందించే మాంసాహార ఉత్పత్తుల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ మనకు విరివిరిగా అలాగే తక్కువ ధరలో లభిస్తూ ఉంటుంది. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో మనం కూర, బిర్యానీ వంటి వాటినే కాకుండా స్నాక్స్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోగలిగిన స్నాక్స్ లో చికెన్ నగెట్స్ కూడా ఒకటి. ఇవి మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చికెన్ నగెట్స్ ను రుచిగా, సులభంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట దొరికే విధంగా ఉండే ఈ చికెన్ నగెట్స్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ నగెట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – అర కిలో, బ్రెడ్ స్లైసెస్ – 5, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి – అర కప్పు, చిలికిన కోడిగుడ్లు – 2, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
చికెన్ నగెట్స్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో 3 బ్రెడ్ స్లైసెస్ ను వేసి మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ క్రంబ్స్ తయారవుతాయి. తరువాత అదే జార్ లో చికెన్ ను, బ్రెడ్ స్లైసెస్ ను వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, వెనిగర్, కార్న్ ఫ్లోర్, పాలు వేసి అన్నీ కలిసేలా మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసిన చికెన్ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో మైదా పిండిని, మరో గిన్నెలో చిలికిన కోడిగుడ్ల మిశ్రమాన్ని అదే విధంగా బ్రెడ్ క్రంబ్స్ ను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసిన చికెన్ మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకుంటూ కావల్సిన ఆకారంలో నగెట్స్ లా చేసుకోవాలి. తరువాత ఈ నగెట్స్ ను మైదా పిండిలో వేసి పిండి అంతా నగెట్స్ కు అతుక్కునేలా చూసుకోవాలి. తరువాత వీటిని కోడిగుడ్ల మిశ్రమంలో ముంచి బయటకు తీసి బ్రెడ్ క్రంబ్స్ లో వేయాలి. నగెట్స్ కు బ్రెడ్ క్రంబ్స్ అంతా పట్టేలా చూసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్ని నగెట్స్ నూ తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత నగెట్స్ ను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ నగెట్స్ తయారవుతాయి. ఈ నగెట్స్ ను టమాట కెచప్ తో లేదా మయనీస్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. చికెన్ ముక్కలను తినడానికి ఇష్టపడని పిల్లలకు ఈ విధంగా చికెన్ నగెట్స్ ను చేసి తినిపించడం వల్ల చికెన్ లో ఉండే పోషకాలు కొంతవరకైనా అందుతాయి. సాయంత్రం సమయాల్లో చికెన్ తో ఇలా నగెట్స్ ను చేసుకుని స్నాక్స్ గా తీసుకోవచ్చు.