మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నింటినీ చౌకగా అందించే ఆహారాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. తల్లిపాల తరువాత అంతటి పోషకాలు గుడ్డులో మాత్రమే ఉంటాయట. కోడిగుడ్డులో విటమిన్ ఎ, బి, డి, ఇ లతోపాటు కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ వంటి తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కోడిగుడ్డును ఉడికించి తినడం వల్ల మాత్రమే మనం అధిక పోషకాలను పొందగలమని నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన కోడిగుడ్డులో ఉండే పచ్చ సొనను చాలా మంది తినరు.
కోడిగుడ్డు తెల్ల సొనలో 8 రకాల మాంసకృత్తులు ఉంటాయి. పచ్చ సొనలో 4 రకాల మాంసకృత్తులు ఉంటాయి. ఈ మాంసకృత్తులు అన్నీ కూడా మన శరీరానికి అవసరమయ్యేవే. షుగర్, గుండె సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ వంటి వాటితో బాధపడే వారు మాత్రమే కోడిగుడ్డులోని పచ్చ సొనను తినకూడదని, ఆరోగ్యవంతంగా ఉన్నవారు ఈ పచ్చ సొనను తినవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో కూడా కోడిగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి గుడ్డు మంచి ఆహారం.
కోడిగుడ్డులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ శక్తి ఉంటాయి. ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా కోడిగుడ్డును తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. తరచూ గుడ్డును తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. గుడ్డు సొనలో 300 మైక్రో గ్రాముల కొలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడి మెదడు నుండి సంకేతాలను ఇతర శరీర భాగాలకు త్వరగా చేరవేయడంలో సహాయపడుతుంది. అదే విధంగా గుడ్డును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల దృష్టి లోపాలు తొలగిపోతాయి.
వీటిలో అధికంగా ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గర్భిణీలు రోజూ ఆహారంలో భాగంగా గుడ్డును తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు కావల్సిన పోషకాలన్నీ అందడంతోపాటు వారి ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. క్యాన్సర్ కారకాలను నశింపజేసే శక్తి కూడా గుడ్డుకు ఉంది. గుడ్డును తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నాడీ మండల పనితీరును మెరుగుపరచడంలో, ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచడంలో కూడా గుడ్డు దోహదపడుతుంది.
వీటిలో అధికంగా ఉండే విటమిన్ డి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. గుడ్డును తరచూ తీసుకోవడం వల్ల జుట్టు, గోళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా వయసు పైబడడం వల్ల వచ్చే ముడతలు తగ్గుతాయి. చాలా మంది పచ్చి గుడ్డును తాగితే శరీరానికి మేలు కలుగుతుందని భావిస్తారు. కానీ ఇది అంతా అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్డులో ఎవిడిన్ అనే గ్లైకో ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి బి విటమిన్ ను అందకుండా చేస్తుంది. కోడిగుడ్డును ఉడికించినప్పుడు మాత్రమే ఎవిడిన్ బయోటిన్ నుండి విడిపోతుంది.
పచ్చి కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత విటమిన్ బి అందదు. కనుక పచ్చి కోడిగుడ్డును మనం ఆహారంగా తీసుకోకూడదు. అదే విధంగా ఫారం కోడిగుడ్లలో కంటే నాటు కోడిగుడ్లలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. గుడ్డును కొనే ముందు దానిని ఊపి చూడాలి. గుడ్డులో సొన కదలనట్టు ఉన్న కోడిగుడ్డును మాత్రమే కొనుగోలు చేయాలి. కోడిగుడ్డులో సొన కదిలినట్టు ఉంటే అది పాడైనదిగా భావించాలి.
టైప్ 2 డయాబెటిస్, యాంటీ బయాటిక్ మందులు వాడే వారు వీటిని తినకపోవడమే ఉత్తతమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా కోడిగుడ్డును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని, గుడ్డును తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.