బొరుగులు.. ఇవి మనందరికీ తెలుసు. బియ్యంతో చేసే ఈ బొరుగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బొరుగులు చాలా త్వరగా జీర్ణమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణశక్తి తక్కువగా ఉన్న వారు వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బొరుగులతో చేసే రుచికర వంటకాల్లో ఉగ్గాని కూడా ఒకటి. రాయలసీమ స్పెషల్ వంటకమైన ఈ ఉగ్గానిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారీకి కావల్సిన పదార్థాలు..
బొరుగులు – 4 కప్పులు, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3 లేదా తగినన్ని, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, చిన్నగా తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బొరుగులను తీసుకుని తగినన్ని నీళ్లను పోయాలి. బొరుగులు నానిన తరువాత వాటిలో ఉండే నీటిని పిండుతూ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు వేసి వేయించుకోవాలి. తరువాత పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. తరువాత టమాట ముక్కలను, పసుపును, ఉప్పును వేసి కలిపిమూత పెట్టి టమాట ముక్కలను పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
తరువాత ముందుగా నానబెట్టుకున్న బొరుగులను వేసి కలిపి మరలా మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మూత తీసి కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉగ్గాని తయారవుతుంది. ఉదయం లేదా సాయంత్రం అల్పాహారాల్లో భాగంగా ఇలా రుచిగా ఉగ్గానిని చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఇలా తయారు చేసిన ఉగ్గానిని అందరూ ఇష్టంగా తింటారు.