Dondakaya Pachadi : మనం వివిధ రకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూరగాయలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. కానీ వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఇతర కూరగాయల లాగా దొండకాయలు కూడా పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. దొండకాయలతో వేపుళ్లను, కూరలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా దొండకాయలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన దొండకాయలు – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పచ్చి మిరపకాయలు – 10 లేదా తగినన్ని, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటలు – 2 ( పెద్దవి), పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – 3 గ్రా., ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దొండకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత దొండకాయ ముక్కలను, పచ్చి మిర్చిని, టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా వేయించాలి. ఇలా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత మరో కళాయిలో పల్లీలను వేసి వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను, చింతపండును వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన దొండకాయ ముక్కలను కూడా వేయాలి.
ఇందులోనే తగినంత ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని రోట్లో వేసి కూడా తయారు చేసుకోవచ్చు. దొండకాయ వేపుడును, కూరను తినలేని వారు ఇలా పచ్చడిగా చేసుకుని తినవచ్చు. ఈ దొండకాయ పచ్చడిని అన్నంతోపాటు దోశ, ఊతప్పం వంటి వాటితో కూడా కలిపి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.