Puli Bongaralu : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో దోశలు కూడా ఒకటి. దోశ పిండిని మనం రెండు మూడు రోజులకు సరిపడా తయారు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఇలా నిల్వ చేసుకున్న దోశ పిండితో లేదా తక్కువ మోతాదులో పిండి మిగిలినప్పుడు ఆ పిండితో మనం పులిబొంగరాలను కూడా తయారు చేసుకోవచ్చు. పులిబొంగరాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. దోశ పిండితో పులిబొంగరాలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పులిబొంగరాల తయారీకి కావల్సిన పదార్థాలు..
పులిసిన దోశ పిండి – ఒక కప్పు, నానబెట్టిన శనగ పప్పు – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, ఉప్పు – తగినంత, పంచదార – 2 టీ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, నూనె – పావు కప్పు.
పులిబొంగరాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పులిసిన దోశ పిండిని తీసుకోవాలి. ఇందులో నీళ్లు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఊతప్పం పిండిలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడయ్యాక దాని మీద ఒక టీ స్పూన్ నూనెను వేయాలి. తరువాత పిండిని తీసుకుని ఊతప్పంలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దానిపై మూత ఉంచి 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. తరువాత మరో వైపుకు తిప్పి నూనె వేసుకుని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పులిబొంగరాలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. దోశ పిండితో తరచూ దోశలనే కాకుండా ఇలా పులిబొంగరాలను కూడా వేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.