Gongura Pachadi : మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకునే ఆకు కూరల్లో గోంగూర ఒకటి. గోంగూరను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో గోంగూర మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గోంగూరతో మనం పప్పును, పచ్చడిని తయారు చేస్తూ ఉంటాం. గోంగూరతో మనం నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. గోంగూరతో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎర్ర గోంగూర కట్టలు – 7 (పెద్దవి), ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – అర టేబుల్ స్పూన్, నూనె – 6 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – 100 గ్రాములు, వెల్లుల్లిపాయ – 1, ఇంగువ – చిటికెడు, ఉప్పు – 50 గ్రాములు లేదా తగినంత.
గోంగూర నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి ఒక వస్త్రం మీద వేసి తడి లేకుండా ఉండేలా ఎండకు ఆరబెట్టాలి. తరువాత ఒక కళాయిలో ఆవాలను, మెంతులను వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత ఎండు మిరపకాయలను వేసి అవి రంగు మారే వరకు కలుపుతూ వేయించుకోవాలి. తరువాత వీటిని కూడా ఆవాలను మిక్సీ పట్టిన జార్ లోనే వేసి మరలా కచ్చాపచ్చాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి.
ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉపయోగించిన కళాయిలోనే మరలా కొద్ది కొద్దిగా నూనెను, తడి లేకుండా ఎండబెట్టుకున్న గోంగూరను వేసుకుంటూ మధ్యస్థ మంటపై గోంగూరలోని నీరు అంతా పోయేలా బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కళాయిలో మిగిలిన నూనెలో ఇంగువను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా ఇంగువను వేసిన నూనెను గోంగూరలో వేసి బాగా కలపాలి. తరువాత ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు మిరపకాయల మిశ్రమాన్ని, తగినంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని గాజు సీసాలో గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల ఒక సంవత్సరం పాటు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడిని, నెయ్యిని వేసి కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూర ఎక్కువగా లభించినప్పుడు ఇలా పచ్చడిగా చేసి నిల్వ చేసుకోవచ్చు.