Kajjikayalu : మనం తయారు చేసే వివిధ రకాల తీపి పదార్థాల్లో కజ్జకాయలు కూడా ఒకటి. కజ్జకాయలను రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనకు బయట స్వీట్ షాపుల్లో కూడా ఈ కజ్జకాయలు లభిస్తూ ఉంటాయి. కరకరలాడుతూ, రుచిగా ఉండేలా ఈ కజ్జకాయలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కజ్జకాయల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు, నెయ్యి – 5 టేబుల్ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, పంచదార – ముప్పావు కప్పు, ఎండు కొబ్బరి తురుము – ఒక కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – పావు కప్పు, గసగసాలు – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

కజ్జకాయల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పిండిని తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, బొంబాయి రవ్వ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో పంచదారను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఎండుకొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, గసగసాలు వేసి దోరగా వేయింయి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత అందులోనే పంచదార పొడిని వేసి కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను, నెయ్యిని వేసి మెత్తని పేస్ట్ అయ్యేలా చేత్తో కలుపుకోవాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని మరోసారి బాగా కలపాలి.
తరువాత ఆ పిండి నాలుగు సహాన భాగాలుగా చేసి ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుని పొడి పిండి వేసుకుంటూ చపాతీలా రుద్దుకోవాలి. ఇలా అన్నింటిని వత్తుకున్న తరువాత ముందుగా ఒక చపాతీని తీసుకుని దానిపై కార్న్ ఫ్లోర్ పేస్ట్ ను వేసి చేత్తో చపాతీ మొత్తం రాయాలి. తరువాత దానిపై మరో చపాతీని ఉంచాలి. దీనిపై కూడా కార్న్ ఫ్లోర్ పేస్ట్ ను రాసి మరో చపాతిని వేయాలి. ఇలా అన్నింటిని వేసిన తరువాత వాటిపై పొడి పిండిని ఒక మూల నుండి మొదలు పెట్టి గుండ్రంగా చుట్టుకోవాలి. తరువాత చాకుతో రెండు ఇంచుల మందంతో ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముక్కను తీసుకుని పొడి పిండి వేసుకుంటూ చపాతీలా రుద్దుకోవాలి. తరువాత దాని మధ్యలో పంచదార మిశ్రమాన్ని ఉంచాలి. చపాతీ అంచుల చుట్టూ నీళ్లు రాసి చపాతీని కజ్జకాయల ఆకారంలో మడుచుకుని అంచులను గట్టిగా వత్తాలి.
తరువాత వాటిఅంచులపై ఫోర్క్ తో గుర్తులు పెట్టి గార్నిష్ చేసుకోవాలి. కజ్జకాయలు వత్తే గిద్దలు ఉన్నవారు వాటిని ఉపయోగించి కూడా కజ్జకాయలను వత్తుకోవచ్చు. ఇలా కజ్జకాయలు వత్తుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినన్ని కజ్జకాయలను వేసి మధ్యస్థ మంటపై కాల్చుకోవాలి. ఈ కజ్జకాయలను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే కజ్జకాయలు తయారవుతాయి. పర్వదినాలకు, ప్రత్యేక రోజులకు ఇలా కజ్జకాయలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి.