Crispy Corn : మనకు వివిధ రకాల మొక్క జొన్నలు మార్కెట్ లో లభిస్తూ ఉంటాయి. అందులో స్వీట్ కార్న్ ఒకటి. స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ కార్న్ ను తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్, కొవ్వులు తక్కువగా ఉంటాయి. మలబద్దకాన్ని తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఇవి సహాయపడతాయి. కంటి చూపును మెరుగుపరచడంతోపాటు జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ స్వీట్ కార్న్ ఎంతో దోహదపడుతుంది.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరానికి హానిని కలిగించే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. స్వీట్ కార్న్ ను మనం ఎక్కువగా ఉడికించి ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేయవచ్చు. స్వీట్ కార్న్ ను క్రిస్పీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే క్రిస్పీ కార్న్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ గింజలు – 2 కప్పులు, కార్న్ ఫ్లోర్ – 5 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – కొద్దిగా, నీళ్లు – ఒక లీటర్, నిమ్మ రసం – ఒక టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన కొత్తిమీర- కొద్దిగా.
క్రిస్పీ కార్న్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లను పోసి స్వీట్ కార్న్ గింజలను, కొద్దిగా ఉప్పును వేసి స్వీట్ కార్న్ ను 60 నుండి 70 శాతం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత జల్లి గిన్నె సహాయంతో స్వీట్ కార్న్ గింజలను, నీటిని వేరు చేయాలి. ఇలా వేరు చేసిన స్వీట్ కార్న్ గింజలను ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో రుచికి సరిపడా మరికొద్దిగా ఉప్పు, మిరియాలు పొడి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక ముందుగా కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలను వేసి ఎర్రగా య్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న స్వీట్ కార్న్ ను ఒక ప్లేట్ పై టిష్యూ పేపర్ లు వేసి అందులోకి తీసుకోవాలి. ఇలా వేయించుకున్న స్వీట్ కార్న్ గింజలపై అధికంగా ఉండే నూనె అంతా పోయిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని కారం, చాట్ మసాలా, నిమ్మ రసం వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ తయారవుతుంది. ఇందులో నిమ్మ రసానికి బదులుగా ఆమ్ చూర్ పౌడర్ ను కూడా వేసుకోవచ్చు. తరచూ చేసే స్నాక్స్ కు బదులుగా అప్పుడప్పుడు స్వీట్ కార్న్ తో ఇలా తయారు చేసుకుని తినవచ్చు. దీంతో రుచికి రుచి.. పోషకాలకు పోషకాలు.. రెండూ లభిస్తాయి.