Vellulli Kobbari Karam : మనం వంటింట్లో కూరలు, పచ్చళ్లతోపాటు వివిధ రకాల కారం పొడిలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసుకునే వాటిల్లో వెల్లుల్లి కొబ్బరి కారం ఒకటి. ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఈ కారం తయారీలో ఉపయోగించే వెల్లుల్లి, కొబ్బరి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్త పోటు తగ్గుతుంది. రక్తాన్ని పలుచగా చేయడమే కాకుండా, చెడు కొవ్వు (ఎల్‌డిఎల్) స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది.
శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలోనూ వెల్లులి సహాయపడుతుంది. ఈ కారంపొడిలో ఉపయోగించే ఎండుకొబ్బరి కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె, మెదడు పని తీరును మెరుగుపరచడంతోపాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జుట్టు పెరుగుదలకు ఎండు కొబ్బరి ఎంతగానో సహాయపడుతుంది. పురుషుల్లో వచ్చే సంతాన సమస్యలను తగ్గించడంలోనూ ఎండు కొబ్బరి దోహదపడుతుంది. ఇక వెల్లుల్లిని, ఎండు కొబ్బరిని కలిపి కారాన్ని ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి కొబ్బరి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి ముక్కలు – ఒక కప్పు, కారం – 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి పాయ -1(పెద్దది), ఉప్పు – రుచికి సరిపడా.
వెల్లుల్లి కొబ్బరి కారం తయారీ విధానం..
ముందుగా వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి కచ్చా పచ్చాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఎండు కొబ్బరి ముక్కలను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత కారం, రుచికి సరిపడా ఉప్పు, కచ్చా పచ్చాగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కొబ్బరి కారం తయారవుతుంది. ఈ కారం 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ లో ఈ కారం పొడిని నిల్వ చేయడం వల్ల 2 నెలల వరకు కూడా తాజాగా ఉంటుంది. ఇందులో జీలకర్రని కూడా వేసుకోవచ్చు. ఈ కారాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి మొదటి ముద్దలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఉదయం అల్పాహారంలో భాగంగా చేసుకునే ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా వంటి వాటితోనూ ఈ కారం పొడిని కలిపి తినవచ్చు. దీంతో పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి.