Nimmakaya Pachadi : నిమ్మ కాయ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. చర్మాన్ని శుభ్రపరిచి, నిగారించేలా చేయడంలో నిమ్మకాయ రసం, నిమ్మకాయల నుండి తీసిన నూనె ఉపయోగపడతాయి. సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పిని తగ్గించడంలో, ఆరోగ్యవంతంగా బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో నిమ్మకాయలు దోహదపడతాయి.
శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించడంతోపాటు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. మనం నిమ్మ రసాన్ని , తేనెను నీళ్లలో కలిపి తాగుతూ ఉంటాం. నిమ్మరసంతో రకరకాల జ్యూస్‌లను, షర్బత్ లను, వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అయితే ఇవే కాకుండా చాలా మంది నిమ్మకాయలతో పచ్చడిని కూడా పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే కింద తెలిపిన విధంగా నిమ్మకాయ పచ్చడిని పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడమే కాదు.. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఇక ఈ పచ్చడిని పెలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నిమ్మ కాయలు – 5 (పెద్దవి), మెంతులు – రెండు టేబుల్ స్పూన్స్, ఆవాలు – నాలుగు టేబుల్ స్పూన్స్, నూనె – ఒకటిన్నర కప్పు, ఇంగువ – అర టీ స్పూన్, కారం -ముప్పావు కప్పు, ఉప్పు – అర కప్పు, నిమ్మ రసం – మూడు పెద్ద నిమ్మకాయల నుండి తీసినంత.
నిమ్మ కాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో మెంతులను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. తరువాత అందులోనే ఆవాలను వేసి వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక కళాయిలో నూనె వేసి కాగాక ఇంగువను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నూనె పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు, కారం, ఉప్పు, ముందుగా చేసి పెట్టుకున్న మెంతి, ఆవాల పొడి, నిమ్మ రసం వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కాచి చల్లార్చి పెట్టుకున్న నూనెను వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని మూత ఉన్న గిన్నెలో ఉంచి మూడు రోజుల పాటు ఊరబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, త్వరగా నిమ్మకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మూడు రోజుల తరువాత ఈ పచ్చడిని ఒకసారి కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి త్వరగా పాడవకుండా చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. దీన్ని రోజూ అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అన్నంలో మొదటి ముద్దతో ఈ పచ్చడిని తింటే అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.