Atukula Mixture : మనం ఆహారంగా అటుకులను కూడా తీసుకుంటూ ఉంటాం. అటుకులను తినడం వల్ల కూడా మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అటుకులతో మనం వివిధ రకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. అటుకులతో చేసే చిరుతిళ్లల్లో అటుకుల మిక్చర్ కూడా ఒకటి. మనం ఎక్కువగా అటుకుల మిక్చర్ ను కారంగా తయారు చేస్తూ ఉంటాం. ఈ అటుకుల మిక్చర్ ను మరో విధంగా మధ్య మధ్యలో తీపి తగులుతూ స్వీట్ షాపుల్లో లభించే విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే అటుకుల మిక్చర్ ను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – 3 కప్పులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, పల్లీలు – పావు కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 6 నుండి 8 లేదా తగినన్ని, పలుచగా పొడుగ్గా తరిగిన ఎండుకొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – 2 రెబ్బలు, పుట్నాల పప్పు – పావు కప్పు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, సోంపు గింజలు – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, ధనియాల పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – చిటికెడు, పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్స్.
అటుకుల మిక్చర్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో అటుకులను వేసి కరకరలాడే వరకు మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఈ అటుకులను ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత పల్లీలను, పచ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి. తరువాత కరివేపాకును వేసి కరకరలాడే వరకు వేయించాలి.
తరువాత పుట్నాల పప్పును, వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించాలి. తరువాత ఎండు ద్రాక్ష, సోంపు గింజలను వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పసుపును, ఉప్పును, కారాన్ని, ధనియాల పొడిని, జీలకర్ర పొడిని వేసి కలుపుతూ కళాయిలో ఉన్న వేడి మీద వేయించాలి. తరువాత ముందుగా వేయించిన అటుకులను వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. చివరగా పంచదార పొడిని వేసి కలుపుకోవాలి.
ఈ విధంగా చేయడం వల్ల కారంగా, తియ్యగా ఉండే అటుకుల మిక్చర్ తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో ఈ విధంగా అటుకులతో మిక్చర్ ను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. తరచూ చేసే అటుకుల మిక్చర్ కు బదులుగా ఇలా చేసిన అటుకుల మిక్చర్ ను కూడా అందరూ ఇష్టంగా తింటారు. పలుచగా ఉండే అటుకులను తీసుకోవడం వల్ల ఈ మిక్చర్ మరింత రుచిగా ఉంటుంది.