Cauliflower Pickle : మనం ఆహారంలో భాగంగా వివిధ రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. కాలిఫ్లవర్ లో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ కాలిఫ్లవర్ తో మనం ఎక్కువగా వేపుళ్లను, కూరలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కాలిఫ్లవర్ తో పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కాలిఫ్లవర్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా ఈ పచ్చడిని చాలా సలువుగా తయారు చేసుకోవచ్చు. కాలిఫ్లవర్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిఫ్లవర్ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా తరిగిన కాలిఫ్లవర్ – 1 (మధ్యస్థంగా ఉన్నది), చిక్కని చింతపండు గుజ్జు – 20 గ్రా లేదా తగినంత, ఆవాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, మెంతులు – ఒక టీ స్పూన్, నూనె – అర కప్పు, ఎండు మిర్చి – 2, ఇంగువ – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, పసుపు – అర టీ స్పూన్, కారం – అర కప్పు, ఉప్పు – పావు కప్పు.
కాలిఫ్లవర్ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కాలిఫ్లవర్ ముక్కలను వేడి నీటితో కడిగి వెంటనే చల్లని నీటితో కడగాలి. ఇలా కడిగిన తరువాత ఈ ముక్కలను ప్లేట్ మీద లేదా శుభ్రమైన కాటన్ వస్త్రం మీద వేసి పూర్తిగా తడి లేకుండా ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టాలి. తరువాత ఒక కళాయిలోఒక టేబుల్ స్పూన్ ఆవాలను, మెంతులను వేసి దోరగా వేయించి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇవి చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడి అయ్యే వరకు మిక్సీ పట్టాలి.
తరువాత అదే కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఆరబెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కలను వేసి వేయించాలి. ఈ ముక్కలను మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఆవాలను, ఎండు మిర్చిని వేసి వేయించాలి. తరువాత ఇంగువను, వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించాలి. తరువాత చింతపండు గుజ్జును వేసి కలపాలి. ఈ చింతపండు గుజ్జును5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి నూనెను పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి.
నూనె చల్లారిన తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత వేయించిన కాలిఫ్లవర్ ముక్కలు వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని తడి లేని గాజు గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి ఒక రోజంతా కదిలించకుండా ఉంచాలి. తరువాత మూత తీసి పచ్చడిని అంతా ఒకసారి కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాలిఫ్లవర్ పచ్చడి తయారవుతుంది.
వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న కాలిఫ్లవర్ పచ్చడిని బయట ఉంచడం వల్ల ఒక నెల రోజుల పాటు అలాగే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. కాలిఫ్లవర్ తో తరచూ కూరలను, వేపుళ్లనే కాకుండా ఇలా పచ్చళ్లను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.