Sweet Boondi : మనకు బయట స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో స్వీట్ బూందీ కూడా ఒకటి. ఈ స్వీట్ బూందీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మందే ఉంటారు. బయట ఎక్కువగా లభించే ఈ బూందీని అదే రుచితో అదే ఆకృతిలో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. స్వీట్ బూందీని ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ బూందీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, గోరు వెచ్చని నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, పంచదార – ఒక కప్పు, నిమ్మరసం – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ – తగినన్ని.
స్వీట్ బూందీ తయారీ విధానం..
ముందుగా ఒక జల్లెడను ఉంచి దానిలో శనగపిండిని వేసి ఉండలు లేకుండా జల్లించుకోవాలి. తరువాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ ఉండలు లేకుండా పలుచగా కలుపుకోవాలి. తరువాత ఇందులో నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పిండిపై మూతను ఉంచి పది నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత అడుగు భాగం మందంగా లోతుగా ఉండే కళాయిలో నూనె పోసి నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యక బూందీ గరిటెను లేదా జల్లి గంటెను తీసుకుని అందులో తగినంత పిండిని వేస్తూ బూందీని వేస్తూ కాల్చుకోవాలి.
ఈ బూందీని పెద్ద మంటపై ఒకటి నుండి రెండు నిమిషాల పాటు కాల్చుకుని టిష్యూ ఉంచిన పేపర్ లోకి తీసుకోవాలి. ఇలా బూందీని తయారు చేసుకున్న తరువాత అడుగు భాగం మందంగా ఉండే మరో కళాయిని తీసుకుని అందులో పంచదారను, ముప్పావు కప్పు నీళ్లను పోసి వేడి చేయాలి. పంచదార కరిగి పంచదార మిశ్రమం కొద్దిగా జిగురులా సాగే వరకు కలుపుతూ వేడి చేయాలి. తరువాత మంటను చిన్నగా చేసి అందులో నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి.
తరువాత ముందుగా వేయించిన బూందీని వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ వేడి చేయాలి. ఇందులో యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిపై మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ నాలుగు నుండి 5 గంటల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల రుచిగా పొడి పొడిగా ఉండే స్వీట్ బూందీ తయారవుతుంది. ఒకసారి పిండిని వేసిన తరువాత బూందీ గంటెను బోర్లించి ఉంచాలి లేదా నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల వేసిన ప్రతిసారీ కూడా బూందీ గుండ్రంగా వస్తుంది. అలాగే మనకు నచ్చిన ఫుడ్ కలర్ ను శనగపిండిలో వేసి రంగురంగుల బూందీని తయారు చేసుకోవచ్చు. ఈ చిట్కాలను అదే విధంగా ఈ కొలతలను పాటించడం వల్ల బయట స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే స్వీట్ బూందీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.