Sweet Corn Pakoda : ఈ సీజన్‌లో మనకు ఎక్కడ చూసినా మొక్కజొన్న కంకులు బాగా కనిపిస్తుంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొందరు మొక్కజొన్నలతో గారెలను తయారు చేసి తింటారు. కొందరు విత్తనాలను వేయించుకుని తింటారు. ఇక కొందరు ఉడకబెట్టి తింటారు. అయితే ఎలా తిన్నా సరే.. మొక్కజొన్నలు భలే రుచిగా ఉంటాయి. ఇక వీటితో పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవికూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కజొన్న పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ – ఒక కప్పు, శనగపిండి – అర కప్పు, బియ్యం పిండి – రెండు పెద్దటీస్పూన్లు, అల్లం తరుగు – ఒక టీస్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, తరిగిన పచ్చి మిరపకాయలు – 4, ఉప్పు – తగినంత, కొత్తిమీర, కరివేపాకు తరుగు – కొద్దిగా, నూనె – వేయించడానికి సరిపడా.
మొక్కజొన్న పకోడీలను తయారు చేసే విధానం..
మిక్సీ జార్‌లో అల్లం తరుగు, పచ్చి మిరపకాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. ఇందులోనే స్వీట్ కార్న్ వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. దీంట్లో శనగపిండి, బియ్యం పిండి, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో పకోడీల్లా వేయాలి. అనంతరం వాటిని ఎర్రగా కాల్చుకుని బయటకు తీయాలి. దీంతో మొక్కజొన్న పకోడీలు తయారవుతాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు. లేదా పల్లి చట్నీ, టమాటా చట్నీతోనూ తినవచ్చు. ఎంతో టేస్టీగా వీటి రుచిని ఆస్వాదించవచ్చు.