Tutti Frutti : కేక్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, డిజర్ట్స్ వంటి వాటిని తయారు చేసేటప్పుడు చూడడానికి అందంగా కనబడడానికి వాటిలో టూటీ ఫ్రూటీలను వేస్తూ ఉంటాం. టూటీ ఫ్రూటీలను వేయడం వల్ల మనం చేసే పదార్థాలు చాలా అందంగా కనబడతాయి. అలాగే ఇవి తియ్యగా రుచిగా ఉంటాయి. ఇవి మనకు ఎక్కువగా బయట వివిధ రంగుల్లో దొరుకుతూ ఉంటాయి. బయట దొరికే విధంగా ఉండే ఈ టూటీ ఫ్రూటీలను అదే రంగులతో అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో టూటీ ఫ్రూటీలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టూటీ ఫ్రూటీల తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చకాయ ముక్కలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), నీళ్లు – ఒక లీటర్, పంచదార – అర కప్పు, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ – పావు టీ స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ – పావు టీ స్పూన్, ఎల్లో ఫుడ్ కలర్ – పావు టీ స్పూన్.
టూటీ ఫ్రూటీ తయారీ విధానం..
ముందుగా పుచ్చకాయ ముక్కలను తీసుకుని పైన ఆకుపచ్చ రంగులో ఉండే చెక్కును తీసేయాలి. అలాగే లోపలి వైపున ఉండే ఎర్రటి భాగాన్ని కూడా పూర్తిగా తీసేయాలి. ఇలా తీసేయగా మిగిలిన తెల్లటి భాగాన్ని వీలైనంత చిన్న ముక్కలుగా టూటీ ఫ్రూటీల ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు రెండు కప్పులు అయ్యేలా చూసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని పోసి స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యక కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను వేసి 3 నుండి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత జల్లిగంటె సహాయంతో నీటిని వడకట్టి ముక్కలను వేరు చేయాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో పంచదారను, పావు కప్పు నీళ్లను పోసి పంచదార కరిగే వరకు కలుపుతూ వేడి చేయాలి. పంచదార కరిగి కొద్దిగా తీగ పాకం వచ్చిన తరువాత ముందుగా ఉడికించుకున్న ముక్కలను వేసి మరో 5 నిమిషాల పాటు కలుపుతూ వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిలో వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. తరువాత ఈ ముక్కలను పంచదార పాకంతో సహా మూడు భాగాలుగా చేసి మూడు గిన్నెలలోకి తీసుకోవాలి. తరువాత ఒక్కో గిన్నెలో ఒక్కో ఫుడ్ కలర్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా రంగు కలిపిన ముక్కలను ఒక రాత్రంతా అలాగే ఉంచాలి.
మరుసటి ఈ ముక్కలను ఒక ప్లేట్ మీద వేసి లేదా టిష్యూ పేపర్ ఉంచిన గిన్నెలోకి తీసుకుని తడి అంతా పోయేలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఇలా తడి లేకుండా ఆర బెట్టుకున్న ముక్కలను గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల అచ్చం బయట దొరికే విధంగా ఉండే టూటీ ఫ్రూటీలు తయారవుతాయి. ఇలా తయారు చేసుకున్న టూటీ ఫ్రూటీలని ఐస్ క్రీమ్ లలో, కేక్, బిస్కెట్స్ వంటి పదార్థాల తయారీలో ఉపయోగించవచ్చు. వీటి తయారీలో పుచ్చకాయకు బదులుగా పచ్చి బొప్పాయిని కూడా ఉపయోగించవచ్చు. పచ్చి బొప్పాయితో కూడా ఇదే విధంగా చేయడం వల్ల బయట దొరికే విధంగా అదే రుచితో ఉండే టూటీ ఫ్రూటీలు తయారవుతాయి.