Vankaya Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలతో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. వంకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో వంకాయ వేపుడు కూడా ఒకటి. ఈ వంకాయ వేపుడును అందరూ ఇష్టంగా తినేలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను తెలుసుకుందాం.
వంకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావు కిలో, పచ్చి బఠాణీలు – పావు కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి – 5 లేదా తగినన్ని, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఉప్పు నీటిలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా వేసి అర నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
ఇప్పుడు వంకాయ ముక్కలను, పచ్చి బఠాణీలని వేసి కలపాలి. వీటిపై మూతను ఉంచి మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. వంకాయ ముక్కలు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చికొబ్బరి మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించి చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం హోటల్స్ లో లభించే విధంగా ఉండే వంకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే వంకాయ వేపుడు కంటే కూడా ఇలా చేసిన వంకాయ వేపుడు మరింత రుచిగా ఉంటుంది.