Veg Kurma : మనం అప్పుడప్పుడూ వంటింట్లో వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. అలాగే వీటిని తినడానికి మనం కుర్మా కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ కుర్మా కూరలో కూరగాయ ముక్కలను వేసి రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు వేసి చేసే వెజ్ కుర్మా కూరను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన బంగాళాదుంప – 1 (పెద్దది), పెద్ద ముక్కలుగా తరిగిన క్యారెట్ – 1, పెద్ద ముక్కలుగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 6, నీళ్లు – రెండున్నర కప్పులు, ఉప్పు – తగినంత, జీడిపప్పు – 6, ఎండు కొబ్బరి – 2 ఇంచుల ముక్క, యాలకులు- 2, దాల్చిన చెక్క ముక్క – 1 (చిన్నది), లవంగాలు – 3, గసగసాలు – ఒక టీ స్పూన్, నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, టమాట ప్యూరీ – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వెజ్ కుర్మా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కూరగాయ ముక్కలను, ఒకటిన్నర కప్పు నీళ్లను, ఒక టీ స్పూన్ ఉప్పును వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఒక జార్ లో జీడిపప్పు పలుకులను, ఎండుకొబ్బరిని, యాలకులను, లవంగాలను, దాల్చిన చెక్కను, గసగసాలను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత సాజీరాను, బిర్యానీ ఆకును, తరిగిన పచ్చి మిర్చిని, కరివేపాకును వేసి వేయించాలి. తరువాత కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయలను వేసి వేయించాలి.
ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత టమాట ప్యూరీ వేసి కలిపి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత ఉడికించిన కూరగాయ ముక్కలను నీళ్లతో సహా వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత మరో కప్పు నీళ్లను పోసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ కుర్మా తయారవుతుంది. దీనిని చపాతీ, వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన వెజ్ కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.