Veg Rolls : మనకు బయట అందుబాటులో ఉన్న ఆహారాల్లో వెజ్ రోల్స్ ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కానీ ఇవి బయటనే లభిస్తాయి. ఇంట్లో ఎలా చేసుకోవాలి.. అని కొందరు ఆలోచిస్తుంటారు. అయితే వీటిని ఇంట్లోనూ చాలా సులభంగా తయారు చేయవచ్చు. కాస్త శ్రమించాలే కానీ రుచికరమైన వెజ్ రోల్స్ తయారవుతాయి. ఇక వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, క్యాబేజ్ తురుము – ఒక కప్పు, క్యారెట్ తురుము – ఒక కప్పు, చిన్నగా తరిగిన క్యాప్సికం – ఒక కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, రెడ్ చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్, తరగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – తగినన్ని.
వెజ్ రోల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, తరిగిన క్యాప్సికం, తగినంత ఉప్పును వేసి పెద్ద మంటపై 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, నిమ్మ రసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మైదా పిండి, కొద్దిగా, ఉప్పు, రెండు టీ స్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండి ముద్దపై మరో రెండు టీ స్పూన్ల నూనె వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు కదిలింకుండా ఉండాలి.
తరువాత పిండి ముద్దను తీసుకుని కావల్సిన పరిమాణంలో చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈ ముద్దలను పొడి పిండి సహాయంతో వీలైనంత పలుచగా చపాతీలలా చేసుకోవాలి. ఇలా చపాతీలలా చేసుకున్న తరువాత పెనంపై వేసి ఒక నిమిషంలోనే రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా మైదా పిండి, తగినన్ని నీళ్లను పోసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ముందుగా చపాతీలలా చేసుకున్న వాటిని తీసుకుని నాలుగు భాగాలు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత వాటి అంచులన్నింటికి మైదా పేస్ట్ ను రాసి, మధ్యలో వేయించి పెట్టుకున్న క్యాబేజ్ తురుము మిశ్రమాన్ని ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. నాలుగు భాగాలకు బదులుగా రెండు భాగాలుగా చేసుకుని కూడా రోల్స్ లా చుట్టుకోవచ్చు.
ఇప్పుడు ఒక కళాయిలో డీప్ ఫ్రైకు సరిపడా నూనెను పోసి.. ముందుగా చుట్టి పెట్టుకున్న రోల్స్ ను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి.. టిష్యూపేపర్ ను ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ రోల్స్ తయారవుతాయి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే వెజ్ రోల్స్ రెడీ అవుతాయి. వీటిలో పచ్చి బఠాణీ, ఉల్లి కాడలు వంటి వాటిని కూడా వేసుకోవచ్చు. దీంతో ఇవి మరింత రుచిగా ఉంటాయి.