Malpua : మనం సులభంగా తయారు చేసుకోగలిగే రకరకాల తీపి వంటకాల్లో మాల్పువా కూడా ఒకటి. మాల్పూవా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా దీనిని అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. మనకు బయట స్వీట్ షాపుల్లో కూడా ఇది లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ మాల్పూవాను తయారు చేయడం చాలా సులభం. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. తరచూ చేసే అల్పాహారాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా మాల్పూవాను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే మాల్పూవాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మాల్పూవా తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలపొడి – 50 గ్రా., మైదాపిండి – 50 గ్రా., పంచదార – 100 గ్రా., పాలు – 120 ఎమ్ ఎల్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె -డీప్ ఫ్రైకు సరిపడా.
మాల్పూవా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పాలపొడి, మైదాపిండి వేసి కలపాలి. తరువాత పాలు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దోశ పిండి మాదిరి ఈ మిశ్రమాన్ని కలుపుకున్న తరువాత దీనిపై మూతను ఉంచి అర గంట పాటు పిండిని నాననివ్వాలి. తరువాత గిన్నెలో పంచదార, ఒక కప్పు నీళ్లు పోసి కలుపుతూ వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి వేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని మరోసారి కలుపుకోవాలి. తరువాత గంటెతో పిండిని తీసుకుని నూనెలో నేరుగా చెక్క అప్పలాగా వేసుకోవాలి.
తరువాత దీనిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తరువాత దీనిని పంచదార పాకంలో వేసి 2 నిమిషాల పాటు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మాల్పూవా తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిపై డ్రై ఫ్రూట్స్ ను కూడా చల్లుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా మాల్పూవాను తయారు చేసుకుని తినవచ్చు.