Mamidikaya Mukkala Pulusu : మామిడికాయలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వేసవికాలంలో ఇవి మనకు విరివిరిగా లభిస్తూ ఉంటాయి. మామిడికాయలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మామిడికాయలను నేరుగా తినడంతో పాటు వీటితో మనం పచ్చళ్లను, పప్పు తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా మామిడికాయలతో మనం పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. మామిడికాయల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా ఈ పులుసును సులభంగా తయారు చేసుకోవచ్చు. మామిడికాయల పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ ముక్కల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, నీళ్లు – ఒక కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్.
పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
పుల్లటి మామిడికాయ – 1(మధ్యస్థంగా ఉన్నది), ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన టమాట – 1, చింతపండు రసం – 1 లేదా 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – రెండున్నర కప్పులు, సాంబార్ పొడి -ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
మామిడికాయ ముక్కల పులుసు తయారీ విధానం..
ముందుగా మామడికాయపై ఉండే తొక్కను తీసేసి నిలువుగా పొడవుగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ లో కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి అర గంట పాటు నానబెట్టాలి. తరువాత ఇందులో కరివేపాకు, పసుపు, నూనె వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి పప్పును కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, పచ్చిమిర్చి, టమాట ముక్కలు, చింతపండు రసం, నీళ్లు , సాంబార్ పొడి వేసి కలపాలి. తరువాత ఈ కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి 5 నుండి 6 నిమిషాల పాటు చారును మరిగించాలి. తరువాత మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. ముక్కలు మెత్తబడే వరకు ఈ చారును మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని చారులో వేసి కలపాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి వెంటనే మూత పెట్టాలి. 5 నిమిషాల తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ ముక్కలు పులుసు తయారవుతుంది.దీనిని అన్నం, అప్పడాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా ముక్కల పులుసును అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.