Mulla Vankaya Plant : మనకు చేలల్లో, బీడు భూముల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా కనిపించే మొక్కలల్లో నేల వంగ మొక్క కూడా ఒకటి. దీనిని ముళ్ల వంగ, కంటకారీ, నేల ములక, నేల వాకుడు, వాకుడు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క నేలపై పాకుతూ పెరుగుతుంది. ఈ మొక్క కాయలు చూడడానికి చిన్న వంకాయల లాగా ఉంటాయి. ఈ మొక్కను ముట్టుకోవడానికి వీలు లేకుండా ముళ్లులు ఉంటాయి. నేల వంగ మొక్కను చాలా మంది కలుపు మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆస్థమాను తగ్గించడంలో, జ్వరాన్ని తగ్గించడంలో, కాలేయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, దగ్గును తగ్గించడంలో, బీపీని తగ్గించడంలో ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు.
వాత, కఫ దోషాలను తగ్గించడంలో నేల వంగ మొక్క చక్కగా పని చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల శరీరంలో నొప్పులు తగ్గుతాయి. రక్తం శుద్ది అవుతుంది. మూత్రంలో మంట, మైగ్రేన్, గొంతు బొంగురు పోవడం, తలనొప్పి, మూత్రాశయంలో రాళ్లను తొలగించడంలో కూడా నేల వంగ మొక్క మనకు దోహదపడుతుంది. పేను కొరుకుడు ఈ ముళ్ల వంకాయలు దివ్యౌషధంగా పని చేస్తాయి. ఈ కాయలను జాగ్రత్తగా సేకరించి దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి తేనెను కలిపి పేను కొరికిన చోట రాయాలి. ఇలా రాయడం వల్ల పేనుకొరుకుడు తగ్గడంతో పాటు ఆ ప్రాంతంలో మరలా వెంట్రుకలు తిరిగి వస్తాయి. నేల వంగ మొక్క సమూల చూర్ణాన్ని పూటకు 6 గ్రాముల చొప్పున రెండు పూటలా తీసుకోవడం వల్ల మూత్రాశయంలో రాళ్లు కరిగిపోతాయి. ఈ నేల వంగ కాయలను సేకరించి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని నుదుటి భాగంలో రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.
పాముకాటు, తేలు కాటు విరుగుడుగా కూడా ఈ మొక్క మనకు సహాయపడుతుంది. ఈ మొక్క వేరును మెత్తగా నూరి దానికి నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని పాము లేదా తేలు కరిచిన చోట ఉంచాలి. ఇలా చేయడం వల్ల విషం హరించుకుపోతుంది. అలాగే నేల వంగ మొక్క ఆకులను దంచి మోకాళ్లపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఈ ఆకుల రసంలో దూదిని ముంచి నొప్పి ఉన్న దంతాలపై ఉంచడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు నేల వంగ మొక్క వేర్లను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ మొక్క వేర్లను నీడలో ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో పెరుగులో కలిపి తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఈ మొక్క ఆకులను ముళ్లతో సహా నూరి రసాన్ని తీయాలి. ఈ రసానికి తేనెను కలిపి బట్టతలపై రాస్తే ఆ భాగంలో తిరిగి వెంట్రుకలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కలుపు మొక్కగా భావించే ముళ్ల వంగ మొక్క మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.