Mamidikaya Pachadi : మామిడికాయ ప‌చ్చ‌డిని ఇలా చేసి తినండి.. అన్నం, టిఫిన్స్ లోకి బాగుంటుంది..!

Mamidikaya Pachadi : మామిడికాయ‌ల సీజ‌న్ రానే వ‌స్తుంది. మామిడికాయ‌లు మార్కెట్ లోకి వ‌చ్చి రాగానే వాటితో చాలా మంది ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటారు. మామిడికాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వీటితో మ‌నం నిల్వ ప‌చ్చ‌డే కాకుండా అప్ప‌టిక‌ప్పుడు తినేలా రోటి ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మామిడికాయ‌తో చేసే రోటి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. లొట్ట‌లేసుకుంటూ తినేలా ఉండే మామిడికాయ రోటి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడికాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మామిడికాయ – 1 ( పెద్ద‌ది), ఎండుమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 3.

Mamidikaya Pachadi recipe in telugu tasty with rice
Mamidikaya Pachadi

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – చిటికెడు.

మామిడికాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా మామిడికాయ‌ను పిక్క లేకుండా ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత‌ క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, మెంతులు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు రోట్లో వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, మెంతులు వేసి మెత్త‌గా దంచాలి. త‌రువాత ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్త‌గా దంచుకోవాలి. త‌రువాత మామిడికాయ ముక్క‌లు వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఈ తాళింపును ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మామిడికాయ రోటి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా తిన‌వ‌చ్చు. ఈ పచ్చ‌డిని మ‌నం జార్ లో వేసి కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మామిడికాయ‌తో ఈ విధంగా త‌యారు చేసిన ప‌చ్చ‌డిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts