Masala Egg Fry : కోడిగుడ్ల‌తో ఇలా మ‌సాలా ఎగ్ ఫ్రై.. ఒక్క‌సారి చేసి తింటే మ‌ళ్లీ కావాలంటారు..!

Masala Egg Fry : మ‌నం ఉడికించిన కోడిగుడ్ల‌తో కూడా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఉడికించిన కోడిగుడ్ల‌తో మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌సాలా గుడ్డు కారం కూడా ఒక‌టి. కింద చెప్పిన విధంగా చేసే ఈ గుడ్డు కారం చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు ఎవ‌రైనా ఈ కారాన్ని చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మ‌సాలా గుడ్డు కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా గుడ్డు కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – అర క‌ప్పు, ఉడికించిన కోడిగుడ్లు – 4, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ లు – 3, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా.

Masala Egg Fry recipe in telugu very tasty with rice
Masala Egg Fry

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 4, అనాస పువ్వు – 1, ల‌వంగాలు – 6, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు, గ‌స‌గ‌సాలు – 2 టీ స్పూన్స్.

మ‌సాలా గుడ్డు కారం త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోడిగుడ్లు వేసి వేయింవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ లోకి వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇందులోనే ప‌చ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు పింక్ రంగులోకి రాగానే ప‌సుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత కోడిగుడ్ల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మ‌రో నిమిషం పాటు వేయించాలి. త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌సాలా గుడ్డు కారం త‌యార‌వుతుంది. ఈవిధంగా త‌యారు చేసిన గుడ్డు కారాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts