Masala Majjiga : మనం మజ్జిగను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల వలె మజ్జిగ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగ తాగడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. శరీరానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు అందుతాయి. నేరుగా మజ్జిగను తాగడంతో పాటు వివిధ రుచుల్లో కూడా మజ్జిగను తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. మనం ఇంట్లో రుచిగా, సులభంగా, చల్లగా తయారు చేసుకోగలిగిన మజ్జిగ వెరైటీలల్లో మజ్జిగ చాస్ ( మసాలా మజ్జిగ) కూడా ఒకటి. ఈ మజ్జిగను తాగడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎంతో రుచిగా ఉండే మసాలా మజ్జిగను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మజ్జిగ చాస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన కొత్తిమీర – పావు కప్పు, పుదీనా తరుగు – పావు కప్పు, అల్లం తరుగు – అర టీ స్పూన్, నల్ల ఉప్పు – అర టీ స్పూన్, పచ్చిమిర్చి – 1, జీలకర్ర పొడి – ముప్పావు టీ స్పూన్, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్స్, మీగడ లేని పెరుగు – అర లీటర్, చల్లటి నీళ్లు – ఒకటింపావు లీటర్.
మజ్జిగ చాస్ తయారీ విధానం..
ముందుగా జార్ లో పెరుగు, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పెరుగు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మజ్జిగను గ్లాస్ లో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా మజ్జిగ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న మజ్జిగను తాగడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ మజ్జిగను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల మజ్జిగ చల్లగా ఉంటుంది. వేసవికాలంలో ఈ విధంగా మజ్జిగను తయారు చేసుకుని తాగడం వల్ల ఎండ ఉపశమనం లభిస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసం తగ్గుతుంది.